బ్రిటిష్ ఇండియాను రెండు దేశాలు - భారతదేశం, పాకిస్తాన్ - గా విభజించాలి అనే ఆలోచన రాత్రికి రాత్రి రూపు చేసుకున్నది అయితే కాదు. పలు పరిస్థితులు, వివిధ ఆలోచనలు, కొన్ని స్వార్థాల పర్యవసానమే జరిగిన విభజన.
ఒకానొక సమయంలో మొహమ్మద్ ఆలీ జిన్నా(పాకిస్తాన్ దేశ పిత, ముస్లిం లీగ్ నాయకుడు) హిందూ-ముస్లిం ఐక్యతకు దివిటీగా పరిగణించబడ్డాడు. మత పరమైన నమ్మకాలను పెద్దగా పట్టించుకోని జిన్నా(మద్యం, పంది మాంసం సేవించే వారు అని ఆరోపణలు ఉన్నాయి) ముస్లిం జనాల సంరక్షకుడిగా రూపాంతరం చెందారు. దీనిని స్వకీయమైన అత్యాశగా కాకుండా మరోలా ఎలా తలవాలో నాకు తెలియదు. మత ఉద్వేగాలకు ఆజ్యం పోసి పోసి అది ‘డైరెక్ట్ యాక్షన్ డే‘కు దారి తీసింది. ఆపై జరిగిన హింసలు సంగతి తెలిసిందే!
జిన్నా యొక్క లక్ష్యం సాకారం కావటంలో ఈ విషయంకు సంబంధించి కాంగ్రెస్ నాయకుల హ్రస్వ దృష్టి పాత్ర లేకపోలేదు. 1920ల్లో గాంధీ జిన్నాను నిర్లక్ష్యం చేసి మత పెద్దలతో జట్టు కట్టారు. తర్వాత కాలంలో నెహ్రూ కూడా ముస్లింలలో జిన్నా ప్రభావాన్ని తక్కువ అంచనా వేసి, ముస్లింలు అందరూ కూడా ఆయనతో సామ్యవాద మార్గంలో నడిచేరు అని నమ్మారు. గుర్తించక, పట్టించుకోక వదిలేసిన జిన్నా యొక్క భావాలు, ఆలోచనలు, వాదాలు అగ్గిపర్వతం వలే లోలోపల ఉడుకుతూ, పెరుగుతూ, ఎగబ్రాకుతూ స్వాతంత్య్ర సమయానికి విస్ఫోటనం చెందాయి.
పరిపూర్ణంగా మతం వైపు పరిణమించిన పాక్షికతకు నిరుపణగా 1946 ఎన్నికల ఫలితాలు నిలుస్తాయి. ‘పాకిస్తాన్ సాధించుకొలేని యెడల ముస్లింలు హిందువుల చేతిలో అణగతొక్కబడతారు‘ అనే ఆలోచనను విజయవంతంగా ముస్లిం జనాల్లోకి తీసుకెళ్లారు. ఫలితం - ముస్లింలకు కేటాయించిన సీట్లలో ఎక్కువ భాగం సీట్లు కైవసం చేసుకున్నారు. కేటాయించిన సీట్లలో రమారమి ముప్పావు శాతం సీట్లు గెలిచారు. ముస్లిం జనాభా తన వెనక ఉన్నారు అనే ధైర్యం వచ్చాక వెనకడుగు వేయాల్సిన, రాజీ పడాల్సిన ప్రసక్తి జిన్నాకు ఏముంది!
బ్రిటిషర్లు ముందు నుంచే ‘విభజించి-పాలించు‘ మంత్రం వాడుతూ వచ్చారు అన్న విషయం తెలిసిందే. ఆధునిక చరిత్రలో హిందువులు ముస్లింలు మధ్య విభేదాలకు బీజం ఇక్కడే పడింది. బ్రిటిష్ ఇండియాకు సెక్రెటరీ ఆఫ్ స్టేట్ గా పని చేసిన లార్డ్ బిర్కెన్హెడ్ అన్న ఈ మాటలు బ్రిటిషర్ల యోచనలకి ప్రతిబింబం:
I have always placed my highest and most permanent hopes upon the eternity of the communal situation.
(ఎప్పుడూ నా అత్యున్నతమైన, శాశ్వతమైన ఆశలు మత విభేదాల మీదే పెట్టుకున్నా.)
ఇదే కాక ముస్లింలను వారి వైపు తిప్పుకోవాలనే ఆశతో ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించటం కూడా రెండు మతాల వారి నడుమ దూరం పెంచి, తద్వారా విభజనకు దారి తీసింది అని చెప్పొచ్చు.
ఈ విధముగా విభజనలో తెలిసో తెలియకో ముస్లిం లీగ్ (జిన్నా ముఖ్యుడిగా), కాంగ్రెస్, బ్రిటిషర్ల పాత్ర ఎంతో కొంత ఉంది - కొందరిది ఎక్కువ, కొందరిది తక్కువ, అంతే!
కొంచెమైనా హింస లేకుండా విభజన సాధ్యపడేది అని అనుకోను. మతం, ఆధ్యాత్మిక సంస్కృతులు సమాజానికి గట్టి స్తంభాలు లాంటివి. చాలా త్వరగా ఉద్వేగాలు రాజుకునేలా చేస్తాయి. రెండు ప్రాంతాల మధ్య ఈ సంస్కృతులు, కట్టుబాట్లు, సంప్రదాయాలలో చెప్పుకోదగ్గ వైవిధ్యం ఉంది. ఈ కారణం వలన ఎంతో కొంత హింస తప్పేది కాదు అని నా భావన.
చిత్రమూలం: వికీమీడియా కామన్స్
కొంత హింసకు పైన చెప్పిన సహజమైన పరిస్థితులు కారణం అయ్యుండొచ్చు కానీ జరిగింది కొంత హింస కాదుగా. మరింత హింసకు కారణాలు:
- ఇండియాను వదిలేయాలి అని లార్డ్ మౌంట్బాటెన్ తొందర.
- స్వాతంత్య్రం వచ్చాక ఆంగ్లేయుల మీద దాడులు జరుగుతాయి అని ఊహించి, అధిక శాతం సైన్యమును వాళ్ళని రక్షించటానికి కేటాయించారు. గవర్నర్ అర్జి పెట్టినప్పటికీ సంక్షోభం ఉన్న చోటకి సైన్యంను పంపలేదు.
- జరిగే హింసకు నెపం తమ మీద పడకూడదు అని బ్రిటిష్ ఆలోచన. అందువలన స్వాతంత్య్రం వచ్చాక కానీ పూర్తి విభజన పథకాన్ని ప్రకటించలేదు.
విభజన, అది విరజిమ్మిన హింస తాలూకు దుష్ఫలితాలు ఇప్పటికీ మనల్ని వీడలేదు.
Comments
Post a Comment