చదువు జీవితంలో ఒక భాగమే కానీ అదే జీవితం కాదని మనందరికీ తెలిసిందే కదా! కేవలం పుస్తకంలో ఉన్నది

***అనుభవ జ్ఞానం***

మనం సాధారణంగా పాఠశాలల్లో చూస్తూ ఉంటాం - సరిగ్గా చదువు రాని వాళ్ళని, చెప్పిన పాఠం అర్థంచేసుకోలేని వాళ్ళని, గుర్తు ఉంచుకోలేని వాళ్ళని, "శుద్ధ మొద్దు అవతారం! నువ్వు జీవితంలో ఎందుకు పనికి వస్తావు?" అంటూ తోటి విద్యార్థులు, ఒక్కొక్కసారి ఉపాధ్యాయులు కూడా అవమానిస్తూ, ఎత్తిపొడుస్తూ ఉంటారు. ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ ఫస్టులు వచ్చిన వాళ్ళ ఫోటోలు పేపర్లో చూసి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని తిడుతూ ఉంటారు. అయితే చదువు జీవితంలో ఒక భాగమే కానీ అదే జీవితం కాదని మనందరికీ తెలిసిందే కదా! కేవలం పుస్తకంలో ఉన్నది బట్టీపట్టో, అర్థం చేసుకొనే అడగగానే సమాధానాలు చెప్పగలిగేవాడికంటే సమాజాన్ని చదివి, ఎలా జీవించాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో, అవి లేనప్పుడు ఎలా వాటిని కల్పించుకోవాలో అనుభవం ద్వారా తెలుసుకున్నవాడే జీవితంలో ఎక్కువగా రాణించగలుగుతాడు. కేవలం పుస్తకాలే జీవితంగా బ్రతికినవాడి ఫోటో ఒకసారి పేపర్లో పడినా, ఆ తరువాత ఎలా జీవించాలో తెలియకపోతే వాడు చాలా అతి సామాన్యమైన జీవితాన్నే జీవించవచ్చు. చదువు వంటపట్టక పరీక్షలు తప్పినవాడు కూడా ఎలా జీవించాలో తెలిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. మనకు తెలిసిన ఎందరో కోటీశ్వరులు సరైన చదువు లేనివారే, కానీ జీవితాన్ని చదివినవారు.

ఇదే సూత్రం ఆథ్యాత్మికంలో కూడా వర్తిస్తుంది. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శక్తిని ఇస్తాడు. మనందరమూ ఆయన చేతిలో పనిముట్లమే. ఏ పనిముట్టు ఎందుకు పనికివస్తుందో, దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఒకరు చక్కగా పాడగలుగుతారు. మరొకరు చక్కగా వ్రాయటమో వేదికలెక్కి ఉపన్యాసాలు చెప్పడమో చేయగలుగుతారు. మరొకరు ఎంతటి లోతైన వేదాంత విషయాలనైనా సులభంగా అర్థం చేసుకొని, గుర్తు పెట్టుకొని, మళ్ళీ చెప్పగలుగుతారు. అంతమాత్రంచేత వారంతా ఏదో సాధించేశారనో, ఇవేవి చేతకానివారు ఎందుకూ పనికిరాని వారనో అర్థం కాదు. అనుభవ జ్ఞానం ముందు పుస్తక జ్ఞానం, పాండిత్యం ఎప్పటికీ దిగదుడుపే. పంచభూతాలు, దశేన్ద్రియాలు, పంచ తన్మాత్రలు, షట్చక్రాలు, గుణత్రయం, వాసనాత్రయం, ఈషణత్రయం, సాధన చతుష్టయం ఇలా టకాటకా అన్నీ అప్పచెప్పే వ్యక్తి తనలో ఏదైనా గుణం ప్రేరేపించినప్పుడు ఎంతవరకు తట్టుకుని నిలబడగలుగుతాడు? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? అదే ఇవేమీ తెలియకపోయినా నిరంతరం భగవన్నామం చేసుకుంటూ తనకు జీవితంలో వచ్చే కష్టసుఖాలన్నింటినీ సమదృష్టితో భగవంతుని ప్రసాదంగా స్వీకరించే భక్తుడు తప్పక నిలబడగలుగుతాడు. ఇక్కడ శాస్త్రజ్ఞానం కన్నా అనుభవ జ్ఞానమే మిన్న కదా!

పుస్తక జ్ఞానం, లేదా శాస్త్రజ్ఞానం ఒక జన్మకే పరిమితమైనది. మరి మన ఆథ్యాత్మిక సాధన జన్మజన్మాంతరాల నుంచీ జరుగుతూనే ఉంది. "సాధనామార్గంలో ఉన్న మానవుడు కర్మవశం చేత మధ్యలోనే జన్మ చాలించవలసి వస్తే అతని సాధన అంతా వృథాయేనా?" అని భగవద్గీతలో అర్జునుడు వెలిబుచ్చిన సందేహానికి గీతాచార్యుడు "అటువంటి భయమేమీ అక్కర్లేదు. ఒక జన్మలో సాధన పూర్తికాక యోగభ్రష్టుడైన సాధకుడు ఎక్కడైతే తన సాధన ఆపాడో తరువాత జన్మలో అక్కడనుండి తన సాధనను కొనసాగించి చివరికి కృతకృత్యుడౌతాడు" అని భరోసా ఇచ్చాడు కదా! మరి ఇదే సూత్రం పుస్తక జ్ఞానానికి వర్తిస్తుందా? ఈ జన్మలో డిగ్రీ చదువుకున్న మానవుడు వచ్చే జన్మలో నేరుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానంటే కుదురుతుందా? మళ్ళీ అతను ఆ జన్మలో నర్సరీనుంచి మొదలు పెట్టవలసిందే కదా! ఇంక ఈ పుస్తక జ్ఞానంతో ఉపయోగం ఏమిటి? "సింహం అడవికి రాజు. అది గర్జించును. దాని పంజా దెబ్బ చాలా గట్టిగా ఉండును" అని ఎన్నిసార్లు వల్లెవేసినా వీడు సింహం కాలేడు కదా! అదే ఇవేమీ చదవకపోయినా, అసలు తనని సింహం అంటారని తెలియకపోయినా ఒక సింహం ఇవన్నీ సహజంగానే చేస్తుంది కదా. అదే పుస్తక జ్ఞానికి, నిజమైన భక్తుడు, లేదా అనుభవ జ్ఞానికి ఉన్న తేడా.

మనం శాస్త్రాలను ఎంతగా వల్లెవేసినా ఆ విద్యతో భగవంతుని మెప్పించలేం. ఎవరైనా మనకు తెలియని విద్యని ప్రదర్శిస్తే 'అబ్బో!' అని ఆశ్యర్యపోతాం, మెచ్చుకుంటాం. అదే మనకు బాగా తెలిసిన విద్యనే ప్రదర్శిస్తే "ఆ! చేశాడులే" అని చప్పరించేస్తాం. మరి ఈ లోకంలోని పుస్తక జ్ఞానమంతా భగవంతుని నుంచి వచ్చిందే కదా. ఇందులో ఆయనకు తెలియనిది, ఆయనను అబ్బురపరిచేది ఏముంటుంది? మరి ఆయనను ఇంప్రెస్ చెయ్యడం ఎలా? అంటే ఆయనకు తెలియనిది, అనుభవంలో లేనిది ఒకటి ఉంది. అదే భక్తి. దానితోనే మనం అయన హృదయాన్ని గెలుచుకోగలం. "ఎందరో భక్తులు నామీద ఇంతటి ప్రేమను చూపిస్తున్నారు. నన్ను చూడకుండా, సేవించకుండా ఉండలేకపోతున్నారు. అసలు ఈ భక్తి, ప్రేమ ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం" అనే ఉత్సుకతతోనే శ్రీకృష్ణుడు తానే రాధ రూపాన్ని ధరించి భక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడని మనకు పెద్దలు చెబుతారు. అలాగే "అందరూ నా పాదాలను విడిచిపెట్టకుండా సేవిస్తూ ఉంటారు. అసలు ఈ పాదాలలో ఉన్న మాధుర్యం ఏమిటో చూద్దాం" అని ఆయన సృష్టి అంతా లయమైపోయిన తరువాత వటపత్రశాయియై తన కాలి బొటనవ్రేలుని తనే నోట్లో పెట్టుకొని ఆస్వాదిస్తూ ఉంటాడని కూడా చెబుతారు. కాబట్టి నిజంగా భగవంతుని మెప్పించేది భక్తి, అనుభవ జ్ఞానాలే కానీ పాండిత్యమూ, శాస్త్రజ్ఞానమూ కాదు.

Comments