ఒకచోట ఒక అద్దాల గది ఉంది. ఆ గది గోడలన్నీ రకరకాల అద్దాలతో చేసినవే. ఒక అద్దం మనను పొడవుగా చూపిస్తే, ఇంకొకటి పొట్టిగా చూపిస్తుంది
అద్దాల గది
ఒకచోట ఒక అద్దాల గది ఉంది. ఆ గది గోడలన్నీ రకరకాల అద్దాలతో చేసినవే. ఒక అద్దం మనను పొడవుగా చూపిస్తే, ఇంకొకటి పొట్టిగా చూపిస్తుంది. ఒకటి లావుగా చూపిస్తే, ఇంకొకటి సన్నగా చూపిస్తుంది. ఒకటి వికృతంగా చూపిస్తే ఇంకొకటి తలక్రిందులుగా చూపిస్తుంది. ఇలాంటి గదిలోకి ఒక కుక్క ప్రవేశించింది. ఎటు చూసినా రకరకాల ఆకారాలలో అనేక కుక్కలు కనిపించాయి. భయమేసి గట్టిగా మొరిగింది. ప్రతిగా అవికూడా మొరిగాయి. తాను బయటకు తప్పించుకునే మార్గం కనపడలేదు. ఇక తెగించి ఆ కుక్కలపై దాడిచేసి ఆ అద్దాలన్నింటిని పగులగొట్టేస్తుంది.
అదే గదిలోకి ఒక చిన్న పిల్లవాడు ప్రవేశించాడనుకోండి. అందులో రకరకాలైన విచిత్ర ఆకృతులలో కనబడుతున్న తన రూపాన్నే చూసుకొని, ఒకసారి సంతోషానికి, ఒకసారి విషాదానికి, భయానికి, కోపానికి ఇలా రకరకాల భావోద్వేగాలకు గురవుతాడు. పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి తనను ఇక్కడినుండి తప్పిస్తే బాగుండును అని ఆరాటపడతాడు. అదే బుద్ధి వికసించిన ఒక పెద్దమనిషి ప్రవేశించాడనుకోండి. ఏంచేస్తాడు? ఎటువంటి మనోవికారానికి లోనుకాకుండా, తననే వివిధ రూపాలలో చూపిస్తున్న ఆ అద్దాల ప్రతిభను మెచ్చుకుంటూ, తన ఇష్టం ఉన్నంతసేపు అక్కడ ఆనందంగా గడిపి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు.
మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం కూడా ఈ అద్దాల గదిలాంటిదే. అందులో మనకు మిత్రులుగా, శతృవులుగా, బంధువులుగా, తెలియనివారిగా, పక్షులుగా, జంతువులుగా, వృక్షాలుగా, వివిధ వస్తువులుగా కనిపించేవన్నీ మన ప్రతిబింబాలే. వాటికీ మనకూ ఎటువంటి తేడా లేదు. వస్తుతః చూసుకుంటే అవన్నీ మనలాగే పంచభూతాలతో నిర్మితమైనవే. కొంచెం లోపలికి వెళితే అన్నిట్లోనూ ఉండి అన్నింటినీ ప్రకాశింపచేసే ఆత్మవస్తువు కూడా ఒకటే. బంగారంతో వివిధ నగలు తయారు చేస్తారు. అది తలమీద పెట్టుకునే కిరీటం కావచ్చు, లేదా కాలికి పెట్టుకునే అందె కావచ్చు. కానీ అది నీకు కావాలంటే దానిలో ఎంత బంగారం ఉందో, ఈ రోజు బంగారం ధర ఎంత ఉందో దాని ప్రకారం లెక్కగట్టి అమ్ముతారు కానీ కేవలం కిరీటం అయినందువలన దానికి ఎక్కువ ధర, కాలి పట్టీ అయినందున దానికి తక్కువ ధర ఉంటాయా?
అయినా మనం ఈ అద్వైతాన్ని గుర్తించక ఆ అద్దాల గదిలోని బాలునివలె రకరకాల భావోద్వేగాలకు గురవుతున్నాం. రాక్షసులవంటి కొందరైతే ఆ కుక్కలాగా ఈ ప్రపంచాన్నే నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి మనకు ఒకరిని చూస్తే ప్రేమ, ఇంకొకరిని చూస్తే ద్వేషం ఇలాంటి భావాలు కలుగుతున్నాయి కానీ వాటికి కారణం మన మనస్సే తప్ప అవతలివారు కాదు కదా. కారణం అవతలివారే అయితే నువ్వు ప్రేమించే, గౌరవించే వారికి నీపట్ల ద్వేషభావం, చులకన భావం ఎలా కలుగుతున్నాయి? నువ్వు ఎంతో ద్వేషించేవారికి నిజానికి నీ పట్ల ఎంతో ప్రేమభావం ఉండి ఉండవచ్చు కదా. పోనీ మనుషులను ప్రక్కన పెట్టినా, నీకు ఎంతో ఇష్టమైన ఆహారపదార్థానికి నీ పట్ల ఎటువంటి భావం ఉండట్లేదు కదా. అంటే ఈ భావోద్వేగాలన్నింటికీ మన మనస్సే కారణం కానీ అవతలి వ్యక్తో లేక వస్తువో కారణం కాదన్నమాట.
ఇంకా ఒకే వస్తువును లేదా వ్యక్తిని వివిధ సందర్భాలలో చూసినప్పుడు నీకు విభిన్నమైన భావనలే కలుగుతున్నాయి కదా. మాములుగా తీపి అంటే ఎంతో ఇష్టమైనవాడు కూడా జ్వరం వచ్చినప్పుడు అదే తీపిని చూస్తే వాంతి చేసుకుంటాడు. అలాగే తాను ఆనందంగా ఉన్నప్పుడు తన పిల్లవాడిని ఒళ్ళో కుర్చోపెట్టుకున్నవాడే పని ఒత్తిడిలో ఉన్నప్పుడు అదే పిల్లవాడిని అవతలకి తోసేస్తాడు. అంటే ఇక్కడ వివిధ భావోద్వేగాలను కలిగించే ఆకారాలన్నీ నీ మనస్సనే అద్దంలో ఉన్న లోపాల కారణంగా వికృతాకారంలో కనిపించే నీ ప్రతిబింబాలేనన్నమాట. అందుకే శ్రీ పరిమి సుబ్రహ్మణ్య భాగవతార్ వారు "నీవు చూచునదెల్ల నీవయేయను తత్వమసి వాక్యమునకు అర్థమ్ము నిజము" అన్నారు.
పై ఉదాహరణలో కుక్కకి, పిల్లవాడికి కనిపించినట్లే బుద్ధి వికసించిన పెద్దమనిషికి కూడా వివిధ వికారాలతో తన ప్రతిబింబాలు కనిపించాయి. అయితే అతడు ఇవన్నీ తన స్వరూపాలేనని, ఇందులో కనిపిస్తున్న వికృతులన్నీ నిజానికి అద్దాలు చేస్తున్న మాయేతప్ప అక్కడగాని, తనలోగాని ఎలాంటి వికృతి లేదని గుర్తించి, ఆ గదిలో ఉన్నంతకాలం హాయిగా, ఆనందంగా ఉన్నాడు. అలాగే జ్ఞాని కూడా మనకు కనిపించినట్లే సృష్టిలోని వైవిధ్యం ఆయనకూ కనిపిస్తున్నా, ఇదంతా కేవలం ఉపాధి స్వభావాలలోని వ్యత్యాసం వల్ల వచ్చినది తప్ప అసలు తత్వంలో ఉన్నదంతా తానేననే జ్ఞానం కలిగి నిశ్చింతగా, ఆనందంగా ఉంటాడు.
Comments
Post a Comment