సామాన్య పరిభాషలో అహంకారం అంటే గర్వం, దర్పం అనుకుంటాం. కానీ వేదాంత పరిభాషలో

అహంకారం
సామాన్య పరిభాషలో అహంకారం అంటే గర్వం, దర్పం అనుకుంటాం. కానీ వేదాంత పరిభాషలో అహంకారం అనే మాట రెండు వేరువేరు అర్థాలలో ఉపయోగించబడుతుంది. మొదటిది అహంకార మమకారాలలో ఉండే అహంకారం. 'నేను' అనే భావనే ఈ అహంకారం. ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. అవే కర్తృత్వాహంకారం, భోక్తృత్వాహంకారం. ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఆ కర్తవ్యాన్ని తనమీద వేసుకోవటం కర్తృత్వాహంకారం. అంటే 'ఈ పని నేను చేస్తున్నాను' అనుకోవటం అన్నమాట. అయితే కేవలం 'నేను చేస్తున్నాను, లేదా చెయ్యగలను' అనుకోవటమే అహంకారం కాదు. 'ఈ పని నేను చేయలేను, లేదా నాకు చేతకాదు' అనుకోవటం కూడా కర్తృత్వాహంకారమే. అంటే బాధ్యతను భగవంతుని మీద వదిలిపెట్టకుండా తనమీద వేసుకోవటం అన్నమాట. నిజానికి మనమందరమూ ఆ భగవంతుని చేతిలో పనిముట్లమే. మనం కాకపోతే ఆ పని ఇంకొకరు చేస్తారు. ప్రపంచంలో ఏదీ ఎవరికోసమూ ఆగదు. మనం ఉన్నా లేకున్నా ఈ ప్రపంచం యథావిధిగా నడిచిపోతూనే ఉంటుంది. లేనిపోని కర్తృత్వాన్ని మీద వేసుకొని సతమతమయ్యేకంటే హాయిగా భారాన్ని భగవంతునిపై వేసి మన ధర్మాన్ని మనం ఆచరించడమే ఉత్తమం. అప్పుడు దాని ఫలితం మనకు కర్మ రూపంలో అంటదు. 

ఇక ఈ పనికి ఫలితం నేనే అనుభవించాలి అనుకోవటం భోక్తృత్వాహంకారం. చాలామందిని చూస్తుంటాం - 'ఈ పనిలో పుణ్యమంతా నాకే వచ్చెయ్యాలి, ఇంకెవరికీ ఇందులో భాగస్వామ్యం దక్కనివ్వను' అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మన అంతిమ లక్ష్యం మోక్షం అయినప్పుడు మనం మధ్యలో వచ్చే ఈ పాపపుణ్యాలను పట్టించుకోకూడదు. మన కర్మ అకౌంటులో పాపం బ్యాలన్స్ ఉన్నా పుణ్యం బ్యాలన్స్ ఉన్నా మళ్ళీ జన్మకు రాక తప్పదు. కేవలం పాపపుణ్యాలే కాదు, మనం చేసే పనియొక్క ఫలితంపై ఏమాత్రం దృష్టి పెట్టినా అది భోక్తృత్వాహంకారమే. క్షణికానందం కోసం పాపకర్మల చేసి దీర్ఘకాలంలో దానివలన వచ్చే కష్టాలు, బాధలు మాత్రం తనకు వద్దు అనుకుంటూ ఉంటాడు మానవుడు. ఇది కూడా భోక్తృత్వాహంకారమే. మనం చేసే కర్మలన్నింటినీ భగవదాదేశంగా భావిస్తూ వాటి బాధ్యతను, ఫలాన్ని కూడా ఆయనకే వదలిపెట్టి శ్రద్ధతో చేస్తే అదే కర్మయోగం అవుతుంది. మోక్షానికి దారితీస్తుంది. 

ఇక పైన చెప్పుకున్నట్లు రెండవ అర్థంలో అహంకారం అనే మాట అంతఃకరణ చతుష్టయంలో భాగంగా వస్తుంది. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నమాట. వీటిలో మనస్సు సంకల్పిస్తే, చిత్తం రికార్డు చేస్తుంది. బుద్ధి నిర్ణయిస్తే అహంకారం ఆ నిర్ణయాన్ని అమలులో పెడుతుంది. దీనినే పురుషకారం లేదా పురుషప్రయత్నం అని కూడా అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము కంటికి కనపడవు కానీ వాటి నిర్ణయాలు అహంకారము ద్వారా వ్యక్తమై కర్మేంద్రియాల ద్వారా ఆ పని అమలులో పెట్టబడుతుంది. ఈ అహంకారమే లేకపోతే సృష్టిలో ఏ ప్రాణీ ఏ పనీ చేయలేదు. పైన చెప్పుకున్న మొదటిరకం అహంకారం మనకు మోక్షానికి అడ్డంకే కానీ ఈ రెండవ రకం అహంకారం మనకు ప్రతిబంధకం కాదు. మసస్సును బుద్ధికి ఆధీనం చేసి, ఆ బుద్ధిని పరమాత్మయందు నిలిపితే, అప్పుడు ఈ అహంకారం ద్వారా చేయబడే క్రియలన్నీ కూడా లోకహితార్థమే అవుతాయి.

గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ వారు ఈ రెండు రకాల అహంకారాలకు రెండు వేరువేరు చికిత్సలు చెప్పేవారు. మొదటిదైన అహంకార మమకారములను వడ్లగింజపై ఉన్న రెండు పొరలతో పోల్చేవారు. ఆ రెండు పొరలు ఉన్నంతకాలం ఆ వడ్లగింజ మొలకెత్తి మళ్ళీ మళ్ళీ అనేక జన్మ పరంపరకు కారణం అవుతుంది. అందుకే ఈ రెండు పొరలను, అంటే అహంకార మమకారములను పూర్తిగా తొలగించుకుంటే కానీ జన్మరాహిత్యం సాధ్యం కాదని చెప్పేవారు. పొరలు తీసివేస్తే వడ్లగింజ బియ్యపుగింజగా మారిపోతుంది కదా? ఎంత నానబెట్టినా బియ్యపుగింజ మళ్ళీ మొలకెత్తుతుందా?

ఇక రెండవ రకం అహంకారం భాగమైన అంతఃకరణ చతుష్టయం అంత చెడ్డదేమీ కాదు. దానిని పూర్తిగా తొలగించుకోవలసిన అవసరం లేదు. శరీరంతో ఉన్నంతకాలం అలా తొలగించుకోవటం సాధ్యం కాదు కూడా. అయితే ప్రపంచం వైపు తిరిగి ఉన్న ఈ నాలుగింటినీ పరమాత్మకు అభిముఖం చేస్తే అప్పుడు మనస్సు సత్యంగాను, దానికి సెక్రటరీ అయిన చిత్తం శాంతిగాను, బుద్ధి దయాస్వరూపంగాను, దానికి సెక్రెటరీ అయిన అహంకారం కళంకరహితమైన ప్రేమ స్వరూపంగాను మారిపోతాయని శ్రీగురుదేవులు వివరించేవారు. 

ఇలా మొదటి రకం అహంకారాన్ని నిర్ములించుకోవటానికి, రెండవ రకం అహంకారాన్ని పరివర్తన చెందించుకోవటానికి మనవంతు కృషిని మనం చేస్తూ ఫలితాన్ని భగవంతునికి వదిలిపెడదాం. ఎప్పుడు ఎవరితో ఏమి చేయించుకోవాలో, ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో ఆయనకే బాగా తెలుసు కదా. అయితే అహంకారాన్ని విడిచిపెట్టడమంటే సోమరితనం కాదు. అలాగే చెడ్డపనులు చేస్తూ 'ఇది నేను చెయ్యట్లేదు, భగవంతుడే నాతో ఇలా చేయిస్తున్నాడు. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి' అని వంకలు చెప్పడం కాదు. 'నిజంగా భగవంతుడే నాతో అన్నీ చేయిస్తున్నాడు అనే భావన నిశ్చయంగా కలిగినవాడు ఎవ్వడూ చెడ్డపనులు చేయలేడు' అని శ్రీగురుదేవుల ఉవాచ.

For more of my articles please visit:

Comments