మనం జీవితంలో ప్రతిరోజూ ప్రతి విషయంలోనూ నాది పరాయిది, మిత్రుడు శత్రువు, గొప్పది తక్కువది, ఇష్టమైనది ఇష్టం లేనిది ఇలా భేదదృష్టితోనే చూస్తూ ఉంటాం.
******సమదృష్టి*****
దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే ||
మనం జీవితంలో ప్రతిరోజూ ప్రతి విషయంలోనూ నాది పరాయిది, మిత్రుడు శత్రువు, గొప్పది తక్కువది, ఇష్టమైనది ఇష్టం లేనిది ఇలా భేదదృష్టితోనే చూస్తూ ఉంటాం. మెత్తటి పరుపులున్న పెద్ద మంచం కనిపిస్తే అదే సుఖం అనుకుంటాం. కటికనేలమీద పడుకోవాలంటే డీలా పడిపోతాం. మన మిత్రులు కనిపిస్తే ముఖం చేటంత చేసుకుంటాం, శత్రువులు కనిపిస్తే అదే ముఖం మాడ్చుకుంటాం. తెల్లగా ఉండేవాళ్ళు, పెద్దపెద్ద కళ్లుగలవారు, లావుగా లేనివారు ఇలా అందానికి కొన్ని నిర్వచనాలు మనమే చెప్పుకొని అలా కనబడినవారిని ఆరాధిస్తాం. దానికి వ్యతిరేక లక్షణాలతో ఉన్నవారిని ఆటపట్టించడమో ఈసడించుకోవటమో చేస్తాం. డబ్బు, అధికారం ఉన్నవాడిని అతిగా గౌరవిస్తాం, పేదవాడిని నెట్టివేస్తాం.
ఈ పైన చెప్పినవన్నీ మనలోనే మనకు తెలియకుండా అంతర్లీనంగా ఉన్న రాక్షస లక్షణాలు. మన పురాణాలలో కనిపించే అనేకమంది రాక్షసులలో ఇవే లక్షణాలు బహిరంగంగా కనిపిస్తాయి. అందులో అందరికంటే బలవంతుడు, దుర్మార్గుడు అయిన రావణుడు తాను సదాశివుని సేవించుకోవాలంటే ముందు తనకు ఎటువంటి దృష్టి అలవడాలో శివతాండవ స్తోత్రంలో భాగమైన పై శ్లోకంలో చెబుతున్నాడు. 'నాఽరుద్రో రుద్రమర్చయేత్' - రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించరాదు - అనేది నియమం. అందుకే మనం శివాభిషేకం చేసుకోవాలంటే ముందుగా మహన్యాసంతో మనలో ప్రతి అంగంలో ఉన్న శివుని మనకు దర్శింపచేసి మన అసలు శివస్వరూపాన్ని మనకు గుర్తింపచేసి అప్పుడు కానీ మనకు అభిషేకానికి అనుజ్ఞ ఇవ్వరు.
మనం శివునిగా మారాలంటే ఆయన లక్షణాలను మనం ముందుగా అలవర్చుకోవాలి కదా. అవే ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. కఠిన శిలను విచిత్ర తల్పాన్ని, పాములదండను ముత్యాల హారాన్ని, మట్టిముద్దను శ్రేష్టమైన రత్నాన్నీ, శత్రువును స్నేహితుని, గడ్డిపోచలలాంటి కళ్లుగలవాడిని అరవిందనేత్రుడిని, సామాన్య ప్రజానీకాన్ని మహేంద్రుడిని సమదృష్టితో చూడటం ఆ శివుని లక్షణం. ఆ నీ లక్షణాన్ని నేనెప్పటికి అలవరచుకొని నీ సేవకు అర్హత సంపాదిస్తాను తండ్రీ! అని రావణుడు ప్రశ్నిస్తున్నాడు.
మనం సాధారణంగా దారిద్య్రానికి కుచేలుడిని, ఐశ్వర్యానికి కుబేరుడిని ప్రతీకలుగా చెప్పుకుంటాం. మనకు అవకాశం వస్తే కుబేరుడితోనే స్నేహం చెయ్యాలనుకుంటాము కానీ కుచేలుడితో కాదు కదా! అలాగే పైన చెప్పిన జతలన్నింటిలో మనం రెండవ వాటినే ఎంచుకోవాలనుకుంటాం కానీ మొదటివాటిని కాదు. భగవంతుని దృష్టిలో ఆ భేదాలేవీ ఉండవు. పదహారు వేల తరుణులను పెండ్లాడగల సిరిగల దేవుడైన శ్రీకృష్ణునికి కుచేలుడు ప్రాణమిత్రుడు. అలాగే ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేసుకొనే శివునికి కుబేరుడు ప్రాణమిత్రుడు.
కృష్ణుడు వెన్నముద్దలను ఎంత ఇష్టంగా తిన్నాడో మట్టిముద్దనూ అంతే ఇష్టంతో స్వీకరించాడు. శివుడు భక్తులందరూ సమర్పించిన నైవేద్యాలను ఎలా స్వీకరించాడో హాలాహలాన్ని కూడా అలాగే స్వీకరించాడు. ఒకరు పాములను దండలుగా ధరించినా మరొకరు ముత్యాల హారాలను ధరించినా, ఒకరి కుమారుడు గడ్డిపోచలలాంటి సన్నని కళ్లుగల వినాయకుడైనా ఇంకొకరి కుమారుడు అరవిందనేత్రుడైన మన్మథుడైనా శివకేశవుల స్నేహానికి ఇవేమీ అడ్డు కాలేదు. వారిద్దరిలో ఎటువంటి భేదదృష్టి లేదు. అసలు వారిద్దరికీ భేదమే లేదు.
మనం కూడా అన్నింటా అటువంటి సమదృష్టిని అలవరచుకొన్నప్పుడే ఆ పరమేశ్వరుని ఆరాధనకు యోగ్యులమౌతాము. అంతేకాని నిరంతరం సృష్టిలో ప్రతిదానిలో భేదభావాన్నే చూస్తూ, సాటి జీవులను హింసిస్తూ మనం ఎన్ని పూజలు చేసినా ఆ పరమాత్మ వాటిని స్వీకరించడు. ఈ సమదృష్టిని సాధించడమే యోగమంటే - సమత్వం యోగముచ్యతే.
Comments
Post a Comment